రా రా

వందకిపైగా చిత్రాల్లో నటించిన అతి తక్కువ మంది కథానాయకుల్లో శ్రీకాంత్ ఒకరు. ఈమధ్య హీరోగా సరైన విజయాలు లేక పెద్ద చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్న ఆయన కథానాయకుడిగా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం చేసిన సినిమా “రా రా”. హారర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం చాన్నాళ్లపాటు ల్యాబ్ లోనే మగ్గి ఎట్టకేలకు నేడు విడుదలైంది. ఫ్యామిలీ హీరోగా ఇమేజ్ ఉన్న శ్రీకాంత్ హారర్ సినిమాతో ఏమేరకు ఎంటర్ టైన్ చేశాడో చూద్దాం..!!raa-raa-movie-review2

కథ : 100 సినిమాలు తీస్తే అందులో 99 సినిమాలతో సూపర్ హిట్ అందుకొన్న ఓ అగ్ర దర్శకుడి సుపుత్రుడు రాజ్ కిరణ్ (శ్రీకాంత్). తండ్రివలే తనయుడు కూడా డైరెక్టర్ అవ్వాలనుకొంటాడు. అయితే.. పండిత పుత్ర పరమ శుంట అన్న చందాన తీసిన మొదటి రెండు సినిమాలు డిజాస్టర్లుగా మిగులుతాయి. దాంతో తండ్రి గుండెపోటుతో మరణించగా.. తల్లి ఆసుపత్రి పాలవుతుంది. తల్లి ఆరోగ్యం కుదుటపడాలంటే సరిగ్గా నాలుగు నెలల్లో ఒక సూపర్ హిట్ సినిమా తీయాలని చెబుతాడు డాక్టర్. దాంతో.. ఒక దెయ్యం సినిమా తీద్దామని డిసైడై ఓ పాడుబడిన బంగ్లాలోకి తన టీం తో సహా వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళాక నిజమైన దెయ్యాలతో సినిమా తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో రాజ్ కిరణ్ తన ఆశయాన్ని సాధించగలిగాడా లేదా? అనేది “రా రా” చిత్ర కథ.raa-raa-movie-review1

నటీనటుల పనితీరు : శ్రీకాంత్ నటించిన మొదటి హారర్ సినిమా ఇది. అందువల్ల ఆయనకి సెటిల్డ్ గా నటించాలో లేక ఎనర్జిటిక్ గా యాక్ట్ చేయాలో అనే కన్ఫ్యూజన్ లో ఎటూకాని నటనతో ఆకట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే.. నటుడిగా శ్రీకాంత్ స్థాయిని తగ్గించే సినిమా ఇది. హీరోయిన్లుగా నటించిన సీతా నారాయణ, నజియాలు కుదిరినంతలో అందాల ప్రదర్శన మీద పెట్టిన దృష్టిలో కనీసం 5% అయినా నటనపై పెట్టి ఉంటే బాగుండేది.

షకలక కాసేపు నవ్వించడానికి ప్రయత్నించి కొద్దిమేరకు సఫలీకృతుడైనప్పటికీ పెద్దగా మెప్పించలేకపోయాడు. ఇక రఘుబాబు, హేమ, నల్ల వేణు తదితరులు కామెడీ పండించడం కోసం చేసిన వికృత చేష్టలు ప్రేక్షకుల పాలిట శాపాలుగా చెప్పుకోవాలి.raa-raa-movie-review4

సాంకేతికవర్గం పనితీరు : ర్యాప్ రాక్ షకీల్ బాణీలే అర్ధం కాలేదని బుర్ర బద్దలు కొట్టుకొంటుంటే.. ఇక మనోడి నేపధ్య సంగీతంతో ప్రేక్షకులకి ఆల్మోస్ట్ పిచ్చెక్కించాడు. పూర్ణ సినిమాటోగ్రఫీ కూడా అదే స్థాయిలో ఉంది. ఈమధ్య షార్ట్ ఫిలిమ్ మేకర్సే ఈయనకంటే బాగా తీస్తున్నారు అనిపిస్తుంది అవుట్ పుట్ చూస్తే. ఎడిటింగ్, గ్రాఫిక్స్, కలరింగ్, డి.ఐ లాంటి సాంకేతికపరమైన విషయాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు.

ఇక ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు అనే విషయాన్ని చిత్రబృందం కూడా చెప్పలేదు. అయితే.. మాకు తెలిసిన ఇన్ఫో ప్రకారం ఈ చిత్రానికి అమ్మ రాజశేఖర్ కొంత భాగానికి దర్శకత్వం వహించగా.. మిగతాది ఒక అసోసియేట్ డైరెక్టర్ షూట్ చేశాడు. అందువల్ల దర్శకత్వ పరమైన లోటుపాట్లకు ఎవర్ని నిందించాలో అర్ధం కాక ఇక్కడితో ఈ విమర్శను ముగించడం జరుగుతుంది.raa-raa-movie-review3

విశ్లేషణ : సినిమాల ఎంపిక విషయంలో ఇకనైనా రెమ్యూనరేషన్ గురించి కాక కథ-కథనం గురించి శ్రీకాంత్ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఆయన ఇదే తరహాలో మరో రెండు సినిమాల్లో నటించాడంటే.. ఒక అయిదారేళ్లలోపే “శ్రీకాంత్ అనే నటుడు ఉండేవాడు” అని ఆయన పాత సినిమాలు చూసి జనాలు తలుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక “రా రా” అనే సినిమాని చూడకుండా ఉండడం మీ జేబుకి మాత్రమే కాక మెదడుకి కూడా సాంత్వన చేకూరుస్తుంది.raa-raa-movie-review5

రేటింగ్ : 0.5/5

Share.