త్రివిక్రమ్ సాయంతో ప్రయోగానికి రెడీ అంటున్న పూజా హెగ్దే..!

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తుంది పూజా హెగ్దే. వరుసగా స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తూ చాలా బిజీగా గడుపుతుంది. మరోపక్క బాలీవుడ్, కోలీవుడ్ నుండీ కూడా ఈ భామకు ఆఫర్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. పూజా హెగ్దే మొదటి సారి తన పాత్రకి సొంత డబ్బింగ్ చెప్పుకున్న చిత్రం ‘అరవింద సమేత’. త్రివిక్రమ్ మొదటిసారి ఈమెతో డబ్బింగ్ చెప్పించాడు. దీంతో ఆమెకు ప్రశంసలు కూడా దక్కాయి. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ చిత్రంలోనే మరో ప్రయోగం చేయబోతుందట.

అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ తెర‌కెక్కుతున్న చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో పూజ గాయ‌ని అవ‌తారం ఎత్త‌నుందట. ఇందుకోసం ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ త‌మ‌న్ ఓ మంచి ట్యూన్ కూడా సిద్ధం చేశాడ‌ని తెలుస్తుంది. తనకి సంగీతమంటే ఇష్టమని పూజ ఇదివరకే ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. “నాకు చిన్న‌ప్ప‌టి నుండీ సంగీతమంటే ఇష్టం. ఖాళీ స‌మ‌యాల్లో పాట‌లు పాడుకుంటుంటా. అయితే ప్రొఫెష‌న‌ల్ సింగ‌ర్ని మాత్రం కాదు. కాక‌పోతే సినిమాల్లో పాడాల‌ని ఆశ‌గా ఉంది“ అంటూ ఒకానొక సంద‌ర్భంలో చెప్పుకొచ్చింది. మొత్తానికి త్రివిక్రమ్ ద్వారా ఈ అవకాశం దొరికింది. మరి పూజ తన గొంతుతో ఎంత వరకూ మెప్పిస్తుందో చూడాలి..!

Share.