ఓం నమో వెంకటేశాయ

“అన్నమయ్య, శ్రీరామదాసు” వంటి భక్తిరస చిత్రాల తరహాలో నాగార్జున నటించిన తాజా ఆధ్యాత్మిక చిత్రం “ఓం నమో వెంకటేశాయ”. వేంకటేశ్వర స్వామికి అనుంగ భక్తుడైన “బాబా హాతిరామ్” జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున కీలకపాత్ర పోషించగా.. అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ప్రత్యేక పాత్రలు పోషించారు. రాఘవేంద్రరావు మ్యాజిక్ కి కీరవాణి మ్యూజిక్ తోడైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు మైమరపించిందో చూద్దాం..!!

కథ : ఇప్పటివరకూ తిరుపతి కొండ ఎక్కని నాస్తికుడికే కాదు.. ఇప్పటికే ఒక మూడునాలుగుసార్లు వేంకటేశ్వరుడి మీద పరమభక్తితో ఏడు కొండలు ఎక్కిన ఆస్తికుడికి కూడా తెలియని “హాతిరామ్ బాబా” జీవితం “ఓం నమో వెంకటేశాయ”. ఆయన జననం మొదలుకొని.. జీవసమాధి కావడం వరకూ అన్నీ విషయాలకు కుదిరినంతలో కమర్షియాలిటీని జోడించి రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో హాతిరామ్ బాబాగా నాగార్జున నటించారు. కలియుగ దేవుడైన వేంకటేశ్వరుడిగా సౌరభ్ రాజ్ జైన్ ముఖ్యభూమిక పోషించిన ఈ చిత్రం కథగా చెప్పడానికి ఏమీ లేదు. కుదిరితే కథనంలో లీనమై భక్తి పారవశ్యంలో మునిగితేలాల్సిందే..!!

నటీనటుల పనితీరు : అన్నమయ్య, శ్రీరామదాసు వంటి సినిమాల్లో టైటిల్ పాత్ర పోషించి వాళ్ళు ఎలా ఉంటారో తెలియని ప్రేక్షకలోకానికి ఒక నిదర్శనంగా నిలిచిన నాగార్జున “ఓం నమో వెంకటేశాయ”లోనూ హాతిరామ్ బాబాగా అద్భుతమైన నటనతో మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్ లో ప్రేక్షకుడి హృదయాన్ని ద్రవింపజేసిన నాగార్జున నటనను చూసి అమితానందానికి గురి కానీ ప్రేక్షకులు ఉండరేమో. ప్రగ్యాజైస్వాల్ ను కేవలం ఒక పాటకు మాత్రమే పరిమితం చేసి.. ఆ పాటలో వీలైనంతమేర శృంగార రసాన్ని ఒలకబోశారు.

ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలకే పరిమితమైపోయిన అనుష్క ఈ చిత్రంలో కృష్ణమ్మగా పరిణితి ప్రదర్శించడంతోపాటు.. పాత్రకు ప్రాణం పోసింది. జగపతిబాబు పాత్ర నిడివి చాలా తక్కువైనప్పటికీ.. ఉన్నంతలో తన మార్క్ వేయాలని విశ్వప్రయత్నం చేసి చివరికి ఏం చేయాలో సైలెంట్ అయిపోయాడు. ఇక మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేయాలని వీరలెవల్లో ట్రై చేశారు.

సాంకేతికవర్గం పనితీరు : గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ పనితనం సినిమాకి మెయిన్ ఎస్సెట్. మహాబలేశ్వరం లొకేషన్స్ ని తిరుపతి కొండలుగా చూపించిన విధానం ప్రశంసనీయం. కీరవాణి సంగీతం, నేపధ్య సంగీతం ప్రేక్షకుల్ని భక్తి పరవశంలో మునిగితేలేలా చేశాయి. గ్రాఫిక్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. తిరుపతి కొండలు, పాలసముద్రం వంటి ప్రదేశాలను గ్రాఫిక్స్ ద్వారా రీక్రియేట్ చేయడం బాగుంది. చాలా సన్నివేశాలు ప్లెజంట్ గా అనిపించాయి.

జె.కె.భారవి మాటల్లో గ్రాంధికం ఎక్కువగా లేకుండా నవతరానికి అర్ధమయ్యే సాధారణ భాష ఉండడం విశేషం. అయితే.. కథనంలో జర్క్స్ ఎక్కువయ్యాయి. చరిత్ర నిశితంగా తెలిసినవారికి మాత్రం ఇదంతా కాస్త అతిగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ లో ఇరికించిన కమర్షియల్ అంశాలు భక్తిరస చిత్రాల అభిమానులకు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి.

దర్శకేంద్రుడు ఫస్టాఫ్ మొత్తం హాస్యరసానికి శృంగార రసం జోడించి అలరించడానికి చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. కానీ.. సెకండాఫ్ లో పూర్తి స్థాయిలో భక్తిరసంపై కాన్సన్ ట్రేట్ చేసి సన్నివేశాలను తెరకెక్కించిన విధానం మాత్రం బాగుంది. క్లైమాక్స్, నిత్యకల్యాణం, పాచికల ఎపిసోడ్స్ సినిమాలో హైలైట్స్ గా చెప్పుకోవచ్చు.

విశ్లేషణ : మాస్, యాక్షన్ సినిమాలకు అలవాటుపడిపోయిన నేటితరం ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకోవడం కష్టమే కానీ.. భక్తిరస చిత్రాలను ఆదరించే నిన్నటితరం ప్రేక్షకులకు, వేంకటేశ్వరస్వామి భక్తులకి మాత్రం బాగా నచ్చే చిత్రం “ఓం నమో వెంకటేశాయ”. నాగార్జున కెరీర్ లో మరో మైల్ స్టోన్ గానూ మిగిలిపోయే సినిమా ఇది!

రేటింగ్ : 3/5

Click Here For ENGLISH Review

Share.