నేనే రాజు నేనే మంత్రి

“బాహుబలి” లాంటి యూనివర్సల్ హిట్ అనంతరం రాణా నటించిన చిత్రం “నేనే రాజు నేనే మంత్రి”. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటీకల్ లవ్ స్టోరీ భారీ అంచనాల నడుమ నేడు విడుదలైంది. కాజల్ అగర్వాల్, కేతరీన్ లు కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది, మరి సినిమా కూడా ఆ స్థాయిలో ఆకట్టుకుందో లేదో తెలియాలంటే మా సమీక్ష చదవాల్సిందే..!!

కథ : జోగేంద్ర (రాణా) ఉరవకొండ మండలంలో న్యాయంగా వడ్డీ వ్యాపారం చేస్తూ తన భార్య రాధ (కాజల్)తో సరదాగా జీవితం గడిపేస్తుంటాడు. ఒకానొక సందర్భంలో ఊరి ప్రెసిడెంట్ భార్యతో జరిగిన గొడవలో రాధ కడుపులో ఉన్న బిడ్డ మరణిస్తుంది. తమకు పుట్టబోయే బిడ్డ చావడానికి, తన భార్య గొడ్రాలిగా మారడానికి ప్రెసిడెంట్ మాత్రమే కాదు అతడి పదవి వ్యామోహం కూడా కారణమని భావించిన జోగేంద్ర “ఇంతింతై వటుడింతై” అన్న చందాన రూపాయి లంచం ఇవ్వకుండా ప్రెసిడెంట్ గా గెలిచి, అదే ఊపులో ఎమ్మెల్యేగానూ నెగ్గుతాడు.

ఆ తర్వాత జోగేంద్ర కన్ను మినిస్టర్ సీట్, దానితర్వాత ముఖ్యమంత్రి కుర్చీపై పడుతుంది. రాజకీయ చదరంగంలో తన ఉనికిని నిలుపుకోవడం కోసం, అదే సమయంలో చాటుకోవడం కోసం జోగేంద్రలోని మంచితనం అడుగంటిపోయి.. దాని స్థానంలో చంచలత్వం చేరుతుంది. దాంతో దారితప్పిన జోగేంద్ర పయనం ప్రమాదంవైపుకు వెళుతుంది. అలా మొదలైన జోగేంద్ర ప్రయాణం చివరికి ఎక్కడికి చేరింది? సీయం కావాలన్న జోగేంద్ర కల నెరవేరిందా, అందుకోసం అతడు ఎదుర్కొన్న అడ్డంకులు ఎలాంటివి అనేది “నేనే రాజు నేనే మంత్రి” కథాంశం.

నటీనటుల పనితీరు : రాణాకి జోగేంద్ర టైలర్ మేడ్ క్యారెక్టర్ లాంటిది, యాటిట్యూడ్ మొదలుకొని ఆహార్యం వరకూ ప్రతి విషయంలో వేరియేషన్ చూపిస్తూ అలరించాడు రాణా. ముఖ్యంగా.. హాస్పిటల్లో ఎమోషనల్ సీన్ లో రాణా నటన చూసి చెమర్చని కన్ను ఉండదు. క్లైమాక్స్ లో రాణా పెర్ఫార్మెన్స్, డైలాగ్స్ సినిమాకి మెయిన్ హైలైట్స్. రాధ పాత్రలో కాజల్ అగర్వాల్ ఒద్దికైనా గృహిణిగా అద్భుతంగా నటించింది.

నిన్నమొన్నటివరకూ గ్లామర్ తో అలరించిన కాజల్ మొదటిసారి గ్లామర్ ఓవర్ డోస్ లేకుండా కేవలం పెర్ఫార్మెన్స్ తో విశేషంగా ఆకట్టుకొంది. అలాగే.. సినిమాలో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ కూడా రాధదే. కేతరీన్ గ్లామర్ తో అలరించింది. చానల్ ఓనర్ గా ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ తో కేతరీన్ సినిమాలో కీలకపాత్ర పోషించింది. ఆమె పాత్ర కొన్ని నిజజీవిత పాత్రలను తలపిస్తాయి. అశుతోష్ రాణాది సినిమాలో ప్రోమినెంట్ రోల్, ఒక అసాంఘిక రాజకీయనాయకుడిగా అశుతోష్ రాణా పాత్రకి ప్రాణం పోసాడు. అజయ్, పోసానికృష్ణమురళిలు సైతం పాత్రలకు న్యాయం చేసి కాస్తంత హాస్యాన్ని కూడా పండించారు. చాలాకాలం తర్వాత శివాజీరాజా మంచి పాత్రలో కనిపించారు. మిగతా ఆర్టిస్టులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు : నిన్నమొన్నటివరకూ రిపీటెడ్ మెలోడీస్ తో చిరాకుపెట్టించిన అనూప్ రూబెన్స్ ఫస్ట్ టైమ్ డిఫరెంట్ మ్యూజిక్ తో ఆకట్టుకొన్నాడు. ముఖ్యంగా నేపధ్యసంగీతంతో ఆశ్చర్యపరచడంతోపాటు ఎమోషన్ ను పీక్ లెవల్ లో ఎలివేట్ చేశాడు. వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ఎస్సెట్. డ్రోన్ షాట్స్, లాంగ్ షాట్ ఔట్ పుట్ క్వాలిటీ అదిరింది. అలాగే.. క్లైమాక్స్ జనాల మధ్య నుండి తీసిన క్లోజప్ క్రేన్ షాట్ సినిమాలోని ఎమోషన్ ను పతాకస్థాయికి తీసుకెళ్లింది. లక్ష్మీ భూపాల్ రాసిన మాటల తూటాలన్నీ విశేషంగా పేలాయి. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయాలను, కొందరు రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ రాసిన మాటలకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అదే సమయంలో.. క్లైమాక్స్ లో రాజకీయ స్థితిగతుల గురించి, మారుతున్న రాజకీయ పరిణామాల గురించి, ప్రభుత్వం-ఓటర్ వ్యవస్థ గురించి లక్ష్మీభూపాల్ రాసిన మాటలు మేల్కొల్పే విధంగా ఉన్నాయి.

కథకు కావాల్సిన మొత్తాన్ని ఖర్చు చేసి నిర్మాతలు కూడా తమ బాధ్యతను నిర్వర్తించారు. ర్యాలీ సీన్స్ కోసం వారు పెట్టిన ఖర్చు వెండితెరపై కనపడుతుంది. దర్శకుడు తేజ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాసుకొన్న కథ పాతదే అయినా ఆ కథను నడిపిన విధానం, కథనం కోసం కథానాయకుడి క్యారెక్టరైజేషన్ ను డిజైన్ చేసిన తీరు ప్రశంసనీయం. ఇంటెన్స్ పోలిటికల్ డ్రామాకు ప్రేమకథను జోడించిన విధానం ప్రతి సగటు సినిమా అభిమానిని అలరిస్తుంది. ముఖ్యంగా.. జోగేంద్ర పాత్ర ఎలాంటి పని చేసినా, పన్నాగం పన్నినా, లేకి పని చేసినా అది తన భార్య రాధ కోసమే చేసేట్టుగా అతడి పాత్రను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. సమకాలీన రాజకీయ అంశాలను స్పృశించిన విధానం కానీ.. కొందరు రాజకీయవేత్తల విధివిధానాలను వేలెత్తిచూపడం, అదే సమయంలో సగటు ఓటరు చేసే చిన్న చిన్న తప్పుల కారణంగా రాజకీయం అనేది నేడు బురదలా ఎలా మారింది, అలాంటి రాజకీయాన్ని మార్చడం కోసం ఏం చేస్తే బాగుంటుంది అంటూ తేజ తన ఐడియాలిజీని ధైర్యంగా ప్రెజంట్ చేసిన తీరు, అదే ధైర్యంతో ఒక యాంటీ క్లైమాక్స్ ను డిజైన్ చేసి, దానికి మళ్ళీ క్లాసిక్ టచ్ ఇవ్వడం సినిమాకి ప్లస్ పాయింట్. అన్నిటికీ మించి రాణా బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్, ఆ సీక్వెన్స్ తో హీరోయిజాన్ని వీరాలెవల్లో ఎలివేట్ చేసిన విధానానికి బి,సి సెంటర్స్ నుండి విజల్స్ రావడం ఖాయం. మొత్తానికి దాదాపు పదిహేనేళ్ళ తర్వాత తేజ మళ్ళీ “నేనే రాజు నేనే మంత్రి”తో ఒక డీసెంట్ హిట్ ను అందుకొన్నాడు.

విశ్లేషణ : తేజ ప్రేమకథలను తీయడంలో ఎక్స్ పెర్ట్, ఈ విషయాన్ని ఇప్పుడు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. “నేనే రాజు నేనే మంత్రి” కూడా ఒక హృద్యమైన ప్రేమకథే, ఆ ప్రేమకథను పోలిటికల్ కాన్వాస్ లో తెరకెక్కించాడు తేజ. దాంతో.. ఆడియన్స్ కు థ్రిల్ తోపాటు ఫీల్ గుడ్ మూవీ చూశామన్న సంతృప్తి కలగడం ఖాయం. సో, రొటీన్ మాస్ మసాలా సినిమాలు చూసి బోర్ కొట్టిన ఆడియన్స్ ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం “నేనే రాజు నేనే మంత్రి” చిత్రాన్ని హ్యాపీగా కుటుంబ సమేతంగా చూడవచ్చు.

రేటింగ్ : 2.5/5

Click Here For ENGLISH Review

Share.