అభిమానుల వల్ల సహనం కోల్పోయిన కత్రినా కైఫ్!

అభిమానులతో ఒక్కో సెలబ్రిటీకి ఒక్కో అనుభవం ఉంటుంది. కొందరు చికాకు పెట్టిస్తే.. మరికొంతమంది కోపం కలిగిస్తారు. పరువు తీసేవారు కూడా ఉంటారు. అలాంటి చేదు అనుభవం కత్రినా కైఫ్ కి ఎదురైంది. వివరాల్లోకి వెళితే…  సల్మాన్‌ ఖాన్‌ ప్రారంభించిన “దబాంగ్‌ టూర్‌” లో భాగంగా కత్రినా, సోనాక్షి సిన్హా, డైసీ షా, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తదితరులు విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ప్రస్తుతం వీరంతా కెనడాలోని వాంకోవర్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ ఓ ప్రదర్శన అయిపోయిన తర్వాత కత్రినా హోటల్‌ రూమ్ కి బయలుదేరుతుండగా.. కొందరు అభిమానులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. కానీ కత్రినాకి వారితో సెల్ఫీలు దిగే ఓపిక లేక తన కారు వైపునకు వెళుతుండగా ఓ యువతి “మాకు నీ ఫొటోలు వద్దు” అని పెద్దగా అరిచింది. అది విని కత్రినాకు కోపం వచ్చింది.

తనపై కామెంట్స్‌ చేసిన యువతిని ఉద్దేశిస్తూ.. “మీరు ఇలా చెడుగా ప్రవర్తించకూడదు. ప్రదర్శన ముగిశాక మేం చాలా అలసిపోయాం. అది మీరు అర్థం చేసుకోవాలి”  అని చెప్పారు. ఇందుకు ఆ యువతి “నీకు నువ్వు నటిగా చెప్పుకొంటావ్‌. నిన్ను ఆరాధించే అభిమానుల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలుసుకో” అని చెంప పగలగొట్టినట్టు సమాధానమిచ్చింది. దీంతో చేసేది లేక కత్రినా అభిమానులతో సెల్ఫీ దిగడానికి ఒప్పుకొన్నారు. కానీ ఆ యువతి మాత్రం తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయింది. కత్రినా తన అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగుతుంటే.. “మేం సల్మాన్‌ కోసం ఎదురుచూస్తున్నాం. కేవలం సల్మాన్‌ కోసమే..” అని అరిచింది. కత్రినా ఇంకేమి మాట్లాడకుండా  వెళ్లిపోయారు. ఇదంతా అక్కడున్న కొందరు వీడియో తీసి పోస్ట్‌ చేయడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Share.