జయ జానకి నాయక

స్టార్ స్టేటస్ తో సంబంధం లేకుండా రెండు భారీ బడ్జెట్ సినిమాల నడుమ ధైర్యంగా రంగంలోకి దిగిన చిత్రం “జయ జానకి నాయక”. “బోయపాటి సినిమా” అనే మార్క్ మినహా జనాల్ని ఆకర్షించే విషయం ఏమీ లేకపోవడం గమనార్హం. బెల్లంకొండ శ్రీనివాస్-రకుల్ జంటగా నటించిన ఈ చిత్రంతో బోయపాటి తనను అమితంగా ఇష్టపడే మాస్ ఆడియన్స్ ను ఏమేరకు సంతృప్తిపరిచాడో చూద్దాం..!!

కథ : అశ్విత్ నారాయణ్ (జగపతిబాబు) సంఘంలో భారీ పరపతితోపాటు, కోట్ల రూపాయల ఆస్తి కలిగిన శక్తివంతమైన ధనవంతుడు. అర్జున్ పవార్ (తరుణ్ అరోరా) పేరు మోసిన లిక్కర్ వ్యాపారి. ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలూ ఒక టెండర్ విషయంలో తలపడతారు. బలవంతులు ఆడే ఆటలో నలిగేది బలహీనులు, అమాయకులే కాబట్టి.. ఆ గొడవలో అకారణంగా స్వీటీ అలియాస్ జానకి (రకుల్) జీవితం నాశనమవుతుంది. అయితే.. జానకిని మనస్ఫూర్తిగా ఇష్టపడిన గగన్ (బెల్లంకొండ శ్రీనివాస్) అండ్ ఫ్యామిలీ తండ్రి (శరత్ కుమార్), అన్నయ్య (నందు)తో కలిసి జానకిని అశ్విత్ నారాయణ్ మరియు అర్జున్ పవార్ ల కబంధ హస్తాల నుండి ఏ విధంగా కాపాడాడు? అందుకోసం అతడు ఎదుర్కొన్న అవరోధాలేమిటి? వాటిని జయించి జానకిని నాయకుడు ఎలా సొంతం చేసుకున్నాడు అనేది “జయ జానకి నాయక” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు : ఒక నటుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ లోని ప్లస్ పాయింట్స్ తోపాటు మైనస్ లు బాగా తెలిసిన బోయపాటి కథానాయకుడి పాత్రను డిజైన్ చేసిన తీరు మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. శ్రీనివాస్ నటన కంటే హాలీవుడ్ సూపర్ హీరో పాత్ర అయిన “హల్క్”ను తలపిస్తూ శ్రీనివాస్ చేసిన ఫైట్స్ గురించే అందరూ మాట్లాడుకుంటారు. సరైనోడు సినిమాలో రెండుమూడు సన్నివేశాల్లోనే ఏడుస్తూ కనిపించిన రకుల్ ప్రీత్ “జయ జానకి నాయక”లో ఒక రెండు పాటలు నాలుగు సన్నివేశాలు మినహా ఏడుస్తునే కనిపించడం ఆమె అభిమానులకు కాస్త నచ్చని విషయమే అయినప్పటికీ.. ఆమె అభినయం మాత్రం ఆకట్టుకుంటుంది. శరత్ కుమార్, జగపతిబాబు, నందు రెగ్యులర్ రోల్స్ లో ఫర్వాలేదనిపించుకున్నారు. విలన్ గా తరుణ్ అరోరా, శ్రావణ్ లు విలనిజాన్ని ఓ మోస్తరుగా ప్రదర్శించారు.

సాంకేతికవర్గం పనితీరు : దేవిశ్రీప్రసాద్ తన పాత ట్యూన్స్ అన్నీ కలిపి అవే ట్యూన్స్ మళ్లీ అందించాడు. ఇక నేపధ్య సంగీతం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీని ప్రత్యేకంగా అభినందించాలి. తన కెమెరాపనితనంతో సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు. ఫైట్ సీక్వెన్స్ లను పిక్చరైజ్ చేసిన విధానం అభినందనీయం. ఎం.రత్నం సంభాషణలు ప్రసంశనీయం. ముఖ్యంగా మహిళలను దృష్టిలో ఉంచుకొని ఆయన రాసిన మాటలు హృద్యంగా ఉండడంతోపాటు ఆలోజింపజేసేవిధంగా ఉన్నాయి.

నిర్మాణ విలువల విషయంలో మిర్యాల రవీందర్ రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదనే విషయం ప్రతి సీన్ లో కనిపిస్తూనే ఉంటుంది. రామ్ లక్ష్మణ్ లు కంపోజ్ చేసిన ఫైట్ సీక్వెన్స్ లు అదిరిపోయే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా హంసలదీవి, వైజాగ్ హైవే దగ్గర జరిగే ఫైట్ సీన్స్ చాలా ఎక్స్ లెంట్ గా కంపోజ్ చేసారు. మాస్ ఆడియన్స్ ను ఈ ఫైట్స్ విశేషంగా ఆకట్టుకుంటాయి. దర్శకుడు బోయపాటి కథ-కథనాల కంటే యాక్షన్ సీన్లపై ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేసాడు. దాంతో స్క్రీన్ ప్లే ములనపడింది. కీలకమైన స్క్రీన్ ప్లే అలరించకపోవడంతో యాక్షన్ సీన్స్ మరియు ఎమోషనల్ సీన్స్ కి కనెక్టివిటీ సింక్ అవ్వదు. అయితే.. మాస్ ఆడియన్స్ ఈ విషయాలను పెద్దగా పట్టించుకోరు అదే విధంగా వైవిధ్యమైన సినిమాలు కోరుకునే ఆడియన్స్ కు ఈ సినిమా పెద్దగా నచ్చదు.

విశ్లేషణ : మాస్ ఆడియన్స్ వరకూ పర్లేదు కానీ.. మిగతా గ్రేడ్ ఆడియన్స్ మాత్రం “జయ జానకి నాయక” చిత్రాన్ని పెద్దగా ఎంజాయ్ చేయలేరు. సో, ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా థియేటర్ కి వెళ్తే పర్లేదు కానీ.. ఏదో ఊహించి, ఆశించి వెళ్తే మాత్రం కష్టమే.

రేటింగ్ : 2/5

Click Here For ENGLISH Review

Share.