ఎఫ్ 2 – ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్

“పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్” చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ దక్కించుకొన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ ఎంటర్ టైనర్ “ఎఫ్ 2”. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల్ని, ముఖ్యంగా పెళ్ళైన మగాళ్లని విశేషంగా ఆకట్టుకొంది. మరి సినిమా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుందో లేదో చూద్దాం..!!

f2-fun-and-frustration-movie-telugu-review1

కథ: వెంకీ (వెంకటేష్) హైద్రాబాద్ లోని ఓ ఎమ్మెల్యే (రఘుబాబు) కి పి.ఏ. తన దగ్గర పనిచేస్తూ తన దగ్గరే పెత్తనం చలాయిస్తున్నాడని తెలిసినప్పటికీ.. తన సీక్రెట్స్ అన్నీ తెలిసినవాడవ్వడంతో వెంకీని మెయింటైన్ చేస్తుంటాడు ఆ ఎమ్మెల్యే. వరుణ్ యాదవ్ (వరుణ్ తేజ్) ఓ సగటు హైద్రాబాదీ కుర్రాడు. రెస్టారెంట్ బిజినెస్ పెట్టుకొని అజమాయిషీ చలాయించే తల్లితో, సీరియల్స్ చూసుకుంటూ.. వాటి విశేషాలను పక్కింటి ఆంటీలతో పంచుకొనే తండ్రితో కలిసి సరదాగా బ్రతికేస్తుంటాడు.

ఈ ఇద్దరి జీవితాల్లోకి వేర్వేరుగా ఎంట్రీ ఇచ్చినా.. పెళ్ళాం అనే పొజిషన్ లో సెటిల్ అవుతారు హారిక (తమన్నా), హనీ (మెహరీన్). వీళ్ళ ఎంట్రీ తర్వాత వెంకీ-వరుణ్ లు అప్పటివరకూ ఎంజాయ్ చేస్తున్న ఫన్ మిస్ అయ్యి ఆ స్థానంలో ఫ్రస్టేషన్ వచ్చి చేరుతుంది. ఈ ఫన్ & ఫ్రస్టేషన్ కలగలిసిన కథాంశమే “ఎఫ్ 2” చిత్రం.

f2-fun-and-frustration-movie-telugu-review2

నటీనటుల పనితీరు: “బాబు బంగారం” సినిమాతో వెంకీ ఈజ్ బ్యాక్ అనుకున్న అభిమానులు.. ఈ సినిమా చూశాక “ఇదిరా మా వెంకటేష్ అంటే” అనుకొనేలా చేశాడు వెంకటేష్. వింటేజ్ వెంకీ ఈ బ్యాక్ అని ఆయన అభిమానులందరూ అనుకొనేలా చేశాడు ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్. ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవల్లో ఉన్నాయి. ముఖ్యంగా.. వరుణ్ తేజ్ తో ఆయన కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయ్యింది.

తన సీనియర్ అయిన వెంకీతో వరుణ్ ఏమాత్రం జంకకుండా చక్కని కామెడీ పండించాడు. ముఖ్యంగా హీరోయిన్ వేషాలు పడలేక ఫ్రస్టేట్ అయ్యే సన్నివేశాల్లో వరుణ్ పెర్ఫార్మెన్స్ బాగుంది. తమన్నా సన్నబడడం కోసం చేస్తున్న ప్రయత్నాల కారణంగానో లేక వయసు మీదకొస్తుండడం వలనో తెలియదు కానీ.. ఒక పాటలో మినహా ఎక్కడా కూడా పెద్ద గ్లామరస్ గా కనిపించలేదు. ఇక మెహరీన్ అర్జెంట్ గా ఏదైనా యాక్టింగ్ స్కూల్లో జాయినైతే బెటరేమో అనిపించింది. చిరాకు పెట్టించే పాత్రే అయినప్పటికీ.. మరీ సహనాన్ని పరీక్షించడం మాత్రం నేరం. శరీర సౌష్టవంతోనూ అలరించలేకపోయింది మెహరీన్.

సినిమా మొత్తం ఈ నలుగురే కనిపించినప్పటికీ.. మధ్యమధ్యలో రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, హరితలు కాస్త నవ్వించారు. ముసలమ్మలుగా అన్నపూర్ణమ్మ, వై.విజయలు కూడా కాస్త హాస్యం పండించారు.

f2-fun-and-frustration-movie-telugu-review3

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు అనిల్ రావిపూడి బేసిగ్గా కథ కంటే కథనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అందువల్ల కథ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. కానీ.. కథనం మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ మొత్తాన్ని హిలేరియస్ గా నడిపించిన అనిల్ రావిపూడి.. సెకండాఫ్ కి వచ్చేసరికి మాత్రం అప్పటికే పక్కన పడేసిన కథతోపాటు కథనాన్ని కూడా సైడ్ చేసేసెసీ.. వరుసబెట్టి సన్నివేశాలు రాసుకొంటూపోయాడు. అయితే.. ఈ తరహా కామెడీ ఎంటర్ టైనర్స్ లో లాజిక్స్ కి పని లేదు కాబట్టి ప్రేక్షకులు వాటిని పెద్దగా పట్టించుకోరు. ఆ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ.. అనిల్ రావిపూడి సెకండాఫ్ ను అనవసరంగా సాగదీయకుండా, మంచి కథ-కథనాలు రాసుకొని ఉంటే ఇంకాస్త బాగుండేది.

దేవిశ్రీప్రసాద్ ఫామ్ కోల్పోయాడో లేక సినిమాలను సీరియస్ గా తీసుకోవడం లేదో తెలియదు కానీ.. ఈ సినిమా మొత్తంలో ఒక్కటంటే ఒక్క గుర్తుంచుకొనే పాట కానీ.. ఫన్నీ బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ లేదు. కామెడీ సినిమా కావడంతో ప్రేక్షకులు దేవి పనితనాన్ని పెద్దగా పట్టించుకోలేదనుకోండి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ లుక్ తీసుకొచ్చింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

f2-fun-and-frustration-movie-telugu-review4

విశ్లేషణ: కథ, కథనం, లాజిక్స్ గురించి పట్టించుకోకుండా థియేటర్ కి వెళ్తే ఫస్టాఫ్ ఫుల్ గా, సెకండాఫ్ అక్కడక్కడా నవ్వించే సినిమా “ఎఫ్ 2”. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ మెంబర్స్ తో చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా.

f2-fun-and-frustration-movie-telugu-review5

రేటింగ్: 2/5

Share.