అరవింద సమేత ఆడియో రివ్యూ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతచిత్రాలైన బృందావనం, బాద్షా లకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించారు. ఇప్పుడు మూడో సారి ట్యూన్స్ ఇచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “అరవింద సమేత వీర రాఘవ” సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ ఆల్బమ్ లో నాలుగు పాటలున్నాయి. అవి నిన్న రిలీజ్ అయ్యాయి. అవి ఎలా ఉన్నాయంటే.. ?

ఏడ పోయినాడో

సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు పదాల తోటని పెంచే అతను పెంచల్ దాస్ తో కలిసి అల్లిన ఈ “ఏడ పోయినాడో” అనే ఎండిన ఆకుల మాల (పాట) రాయలసీమలోని పగలు, ప్రతీకారాలు అనే తిరిగే వారి జీవితాన్ని కళ్ళకి కడుతోంది. థమన్ ఇచ్చిన ట్యూన్ కి నికిత శ్రీవల్లి , కైలాష్ ఖేర్ , పెంచల్ దాస్ లు తమ గాత్రంతో చెవిలో ఇంకిపోయేలా చేశారు. ఈ పాట విన్న తర్వాత కొంతకాలం పాటు ఎక్కడున్నా మనకి వినిపిస్తున్న భావన కలుగుతుంది.

అనగనగనగా

చిత్ర బృందం తొలి సారి రిలీజ్ చేసిన పాట ఇది. “పులిపై పడిన లేడి కథ వింటారా” అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి పద ప్రయోగాలు చాలా రొమాంటిక్ గా అనిపించాయి. గజిబిజి మ్యూజిక్ లేకుండా హాయి గొలిపే ట్యూన్ లో అర్మాన్ మాలిక్ చాలా కూల్ గా పాడి అభినందనలు అందుకుంటున్నారు. ఈ పాటలో ఎన్టీఆర్, పూజా మధ్య కెమిస్ట్రీ కొత్త అనుభూతిని పంచడం గ్యారంటీ.

పెనివిటి

రాయలసీమలో పుట్టి పెరిగినట్టు.. అక్కడి మహిళల కన్నీటి గాథలను స్వయంగా చూసినట్టు రామజోగయ్య శాస్త్రి పెనివిటి పాటను అద్భుతంగా రాశారు. కాల భైరవ పాడుతుంటే మనకు తెలియకుండానే కళ్ళల్లో చెమ్మ వస్తోంది. అడా మగ అనితేడా లేకుండా భావోద్వేగం చెందేలా థమన్ ట్యూన్ ఇచ్చారు. ఈ పాట కొన్ని ఏళ్ళ పాటు గుర్తిండిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

రెడ్డి ఇక్కడ సూడు

పైన తెలిపిన మూడు పాటలు సందర్భానుసారం వస్తుంటాయి. కానీ మాస్ ప్రజలు విజిల్స్ వేయాలంటే ఓ పాట తప్పనిసరి. అందుకోసమే థమన్ “రెడ్డి ఇక్కడ సూడు” పాటకి జోష్ బీట్ ఇచ్చారు. ఇదివరకు ఎక్కడో వినే భావన కలుగుతున్నప్పటికీ అంజనా సౌమ్య , దలేర్ మెహందీ లు తమ గాత్రాలతో మాయ చేశారు.
ఇందుకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు.

చివరి మాట..
కమర్షియల్ సినిమా అనగానే ఆరు పాటలు ఉండాలి. అందులో ఓ ఐటెం సాంగ్ ఉండాలి అనే రూల్స్ పెట్టుకోకుండా పూర్తిగా కథకి అనుగుణంగానే పాటలు పెట్టించారు. ఆ ఫ్లేవర్ కి తగ్గట్టు థమన్ సంగీతాన్ని ఇవ్వడంలో పూర్తి విజయాన్ని సాధించారు. పెనిమిటి, ఏడ పోయినాడో .. పాటల్లో దేనికి నంబర్ వన్ స్థానం ఇవ్వాలో తెలియనంతగా అందరికీ గుండెల్లోకి చేరిపోయింది. అనగనగనగా అయితే అందరూ హమ్ చేసే విధంగా ఉంది. సో సినిమాకి ఆడియో మాత్రం ప్లస్ అని చెప్పవచ్చు.

Share.