అర‌వింద స‌మేత‌

నందమూరి అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ ఎట్టకేలకు సెట్ అయ్యి.. ఆ కాంబినేషన్ లో వచ్చిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా “అరవింద సమేత”. రెగ్యులర్ ఫ్యాక్షన్ సినిమాలకంటే వైవిధ్యంగా రూపొందిన ఈ చిత్రంతో త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ అనిపించుకొన్నాడా? ఎన్టీయార్ తన సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేశాడా లేదా? అనేది సమీక్షలో చూద్దాం..!!aravinda-sametha-2

కథ : కొమ్ముది-నల్లగుడి అనే రెండు ఉర్ల నడుమ 5 రూపాయల కారణంగా మొదలైన గొడవ హత్యాకాండగా రూపాంతరం చెంది.. ఫ్యాక్షన్ గొడవలుగా మారతాయి. ఆ గొడవ మొదలైంది బసిరెడ్డి (జగపతిబాబు) వల్లే అయినప్పటికీ.. పెంచి పోషించింది మాత్రం నారపరెడ్డి (నాగబాబు). ఈ ఇద్దరి నడుమ గొడవల కారణంగా ఏళ్ల తరబడి ఈ రెండు ఉర్లలో మాత్రమే కాదు చుట్టుపక్కల 20 ఉర్ల జనాలు కూడా నరుక్కొని, బాంబులు విసురుకుంటూ ఒకొర్నొకరు చంపుకుంటూనే బ్రతుకుతుంటారు.

ఫ్యాక్షనిజానికి రాజకీయం తోడవుతుంది. ఆ రాజకీయ రంగులో గొడవలు మరింత ఊపందుకుంటాయే తప్ప చల్లారవు. ఈ రెండు ఉర్ల జనాల గుండెల్లో పాతుకుపోయిన పగ-ప్రతీకారాలను హింసతో కాక మాటలతోనే కట్టడి చేయాలని ప్రయత్నించిన ఓ నవసారధి ప్రయాణమే “అరవింద సమేత వీరరాఘవ” కథాంశం. aravinda-sametha-1

నటీనటుల పనితీరు : నటనకి రూపం వస్తే ఎట్టా ఉంటాదో తెలుసా.. కళామ్మతల్లికి ఓ పాపోడు పుడితే ఎట్టా ఉంటాడో తెలుసా.. నిప్పురవ్వకి ప్యాంటు-షర్టు వేస్తే ఎట్టా ఉంటాదో తెలుసా.. ఈ ప్రశ్నలకు సమాధానమే “అరవింద సమేత” చిత్రంలో ఎన్టీఆర్. ఈ పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోవడం కాదు.. ఎన్టీఆర్ కోసమే త్రివిక్రమ్ మనసు పొరల్లోంచి ఈ కథ, ఆ పాత్ర పుట్టాయేమో అనిపిస్తుంది. పాత్రలో పౌరుషం ఉంటుంది కానీ.. వ్యవహారశైలిలో నిబద్ధత ఉంటుంది, మనిషి రక్తం మరుగుతూనే ఉంటుంది.. కానీ మనసు మాత్రం మంచే కోరుకుంటుంది. ఎన్టీఆర్ తప్ప మరెవరూ ఈ పాత్రకి న్యాయం చేయలేరేమో అని ఎన్టీఆర్ అభిమానులు కానివారు కూడా అనుకొనేలా నట విశ్వరూపం ప్రదర్శించాడు ఎన్టీఆర్.

సాధారణంగా ఈ తరహా ఫ్యాక్షన్ సినిమాల్లో హీరోయిన్స్ ను కేవలం ఓ రెండు పాటలు, నాలుగు సన్నివేశాలకి పరిమితం చేస్తుంటారు. కానీ.. ఈ సినిమా కథనం ముందుకు వెళ్ళేదే పూజా హెగ్డే వల్ల. పూజా హెగ్డే కెరీర్ లోనే కాదు.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలను పక్కనపెడితే.. ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూ ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పాత్ర లభించలేదు. దొరికిన ఈ అద్భుతమైన అవకాశాన్ని పూజా హెగ్డే పూర్తిస్థాయిలో వినియోగించుకొని ఎన్టీఆర్ ను డామినేట్ చేసే స్థాయి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొంది. సాధారణంగా క్రూరులు అనే పదం పేపర్లలో చదవడం తప్ప, టీవీల్లో వచ్చే వార్తల్లో వినడం తప్ప ఎప్పుడూ చూసి ఉండం. ఈ సినిమాలో జగపతిబాబు పాత్ర ఆ పదానికి నిలువెత్తు రూపంలా ఉంటుంది. మనిషి ఇంత క్రూరంగా, మూర్ఖంగా ఉంటాడా అని థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు జగపతిబాబు పాత్రను తిట్టుకుంటాడు, కోప్పడతాడు, అసహ్యించుకుంటాడు, అతడు చనిపోతే బాగుండు అని కోరుకొంటాడు, చనిపోగానే మనస్ఫూర్తిగా సంతోషిస్తాడు. జగపతిబాబు తన పాత్రతో ప్రేక్షకుల్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇది. ఆయన కెరీర్ లో లెజండ్ తర్వాత అంతకుమించిన విలనిజం ప్రదర్శించిన సినిమా అంటే “అరవింద సమేత” అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు.

కత్తికి సానబెడితే ఎంత చాచక్యంగా పనిచేస్తుంది అనేందుకు నవీన్ చంద్ర పాత్ర ఒక చక్కని ఉదాహరణ. త్రివిక్రమ్ అతడిలోని నటుడ్ని ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం చేశాడు. ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్ లో చెప్పినట్లు.. ఈ సినిమాకి నవీన్ చంద్ర ఒక మెయిన్ పిల్లర్ లాంటివాడు. సునీల్ ను ఒక కమెడియన్ గా కాకుండా కథకుడిగా సినిమాలో చూపించడంతోపాటు అతడి పాత్ర వ్యవహారశైలి ద్వారా ప్రేక్షకుల్ని నవ్వించి త్రివిక్రమ్ 16 ఏళ్లలో కేవలం 10 సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ ఎలా అయ్యాడు అనేందుకు సమాధానం చెప్పాడు. చిన్న పాత్రలే అయినప్పటికీ.. ఈషారెబ్బ, నరేష్, చాలారోజుల తర్వాత శుభలేక సుధాకర్, దేవయాని వంటి వారందరూ అద్భుతమైన నటనతో అలరించారు. aravinda-sametha-4

సాంకేతికవర్గం పనితీరు : “తమన్ నన్ను ఆశ్చర్యపరిచాడు” అని త్రివిక్రమ్ చెప్పినప్పుడు.. అంతగా తమన్ లో ఏముంది? మహా అయితే డప్పులు పక్కనపెట్టి గిటార్ మోగించి ఉంటాడు అనుకొన్నాను. కానీ.. చనిపోయిన తండ్రి ఉన్న కార్ లో ఎక్కడం కోసం ఎన్టీఆర్ డోర్ ను లాగి పడేసి ఎక్కే సన్నివేశానికి ఎలాంటి బీజీయమ్ ను యాడ్ చేయకుండా.. నిశ్శబ్ధంతో ఎన్టీఆర్ పెయిన్ ను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేసినప్పుడే తమన్ మీద రెస్పెక్ట్ పెరిగింది. సినిమా స్థాయిని, ఎమోషన్ ను ను బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎలా పెంచవచ్చు అనేందుకు “అరవింద సమేత”లో తమన్ వర్క్ ఒక ఉదాహరణలా ఎప్పటికీ నిలిచిపోతుంది. తమన్ కెరీర్ లో బెస్ట్ బీజీయమ్ & సౌండ్ డిజైన్ వర్క్ చేసిన సినిమా ఇదే.

పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీతో ప్రేక్షకుల్ని థియేటర్ నుంచి డైరెక్ట్ గా తీసుకెళ్లి రాయసీమలో కూర్చోబెట్టేశాడు. ఎన్టీఆర్ కి ఇచ్చిన ఎలివేషన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో.. నందమూరి అభిమానులందరూ సదరు షాట్స్ ను ఫ్రేమ్స్ ను చాలా కాలం గుర్తుపెట్టుకొంటారు. ఎడిటింగ్, డి.ఐ, కలరింగ్ వంటివన్నీ అద్భుతంగా కుదిరాయి. కథకి అవసరమైనంత ఖర్చు పెట్టే వ్యక్తిని నిర్మాత అంటే.. ఈ సినిమాకు చినబాబు నిర్మాత అని అనలేమ్. ఆయన కథకి అవసరమైనంత కాదు.. సినిమాలోని ఎమోషన్ ను ఆడియన్స్ కి రీచ్ అయ్యే విధంగా ఖర్చు చేసే వ్యక్తి. అందుకే ఆయన్ని రూపకర్త అనొచ్చు.

దర్శకుడిగా త్రివిక్రమ్ మార్క్ “అజ్ణాతవాసి”లో దారుణంగా మిస్ అయ్యింది అని ఫీలైన ఆయన అభిమానులందరూ కాలర్ ఎగరేయడం కాదు.. షర్టు బొత్తాలు విప్పుకొని మరీ ఆనందంతో డ్యాన్స్ చేసేలా ఉన్నాయి ఈ సినిమాలో సంభాషణలు, సన్నివేశాల రూపకల్పన. “పెనివిటి” పాటలో.. ఓ గొడవలో మరణించిన వ్యక్తిని ఇంటికి మోసుకొచ్చి గుమ్మం ముందు పడుకోబెడితే.. అతడు తన భర్తేనేమోనని భయపడి పరిగెట్టుకుంటూ గుమ్మం వరకు వచ్చిన దేవయాని.. ఆ శవం తన భర్తది కాదని తెలుసుకొన్న తర్వాత నాగబాబును చూస్తూ ఆమె కార్చిన కన్నీటిబొట్టుకు త్రివిక్రమ్ పెట్టిన ఫ్రేమ్ ఒక్కటి చాలు ఆయన్ని గురూజీ అని ఎందుకు పిలుస్తారో అర్ధమవ్వడానికి. బేసిగ్గా.. ఫ్యాక్షన్ సినిమాలంటే హీరో విలన్ ని చంపేయడంతో ముగిసిపోతుంటాయి.

కానీ.. ఆ మారణఖాండ తర్వాత కథ ఏమిటి? అనేది మాత్రం ఇప్పటివరకు ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ లాంటి మన బి.గోపాల్, వినాయక్ వంటి దర్శకులు ఎప్పుడూ చూపించలేదు. త్రివిక్రమ్ సరిగ్గా ఆ పాయింట్ నే టచ్ చేశాడు. కథ కాస్త కొరటాల “మిర్చి” సినిమాను గుర్తుకుతెస్తుంది కానీ.. ఆ డీలింగ్ వేరు, ఈ నేరేషన్ వేరు. ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్స్ లో “అరవింద సమేత” మొదటిస్థానంలో నిలుస్తుంది. అలాగే.. ఒక మనిషి జీవితంలో తన పక్కన ఉండే ఆడదాని మాట వింటే ఎంత బాగుంటుంది అనే పాయింట్ ను కూడా త్రివిక్రమ్ కథాంశంగా వాడిన తీరు ప్రశంసనీయమే కాదు పారదర్శకంగానూ ఉంటుంది. అందరు త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు కానీ.. ఆయన ఎప్పుడు అక్కడే ఉన్నాడు. కాకపోతే.. ఆయన పెన్నుకు పట్టిన తుప్పు కాస్తా ఈ సినిమాతో వదిలింది అంతే.aravinda-sametha-3

విశ్లేషణ : ఫ్యాక్షన్ సినిమాల్లో సరికొత్త జోనర్ సినిమా “అరవింద సమేత వీరరాఘవ”. త్రివిక్రమ్ పెన్నుకు పదును పెట్టి మరీ రాసిన మాటలు, సన్నివేశాల కోసం.. ఎన్టీఆర్ నటవిశ్వరూపం కోసం ఈ సినిమాను తప్పకుండా కుటుంబ సమేతంగా చూడాల్సిందే.aravinda-sametha-5

రేటింగ్ : 3/5

Share.