అబ్బురపరుస్తున్న అంతరిక్షం టీజర్!

“గంటకి 2000 కిలోమీటర్ల స్పీడ్ తో అంతరిక్షంలో ప్రయాణిస్తున్న మిహిర శాటిలైట్ కు సహాయం అందించడం కోసం అంతరిక్షంలోకి వెళ్ళిన ఒక బృందం ఎదుర్కొన్న సమస్యలు, ఆ సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ వారు సాగించిన ప్రయాణమే “అంతరిక్షం” కథాంశం” అని చాలా సింపుల్ గా తేల్చి చెప్పేశాడు నేషనల్ అవార్డ్ విన్నర్ సంకల్ప్ రెడ్డి. “ఘాజీ” అనంతరం సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న స్పేస్ ఎంటర్ టైనర్ “అంతరిక్షం”. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ను ఇవాళ విడుదల చేశారు. టీజర్ లో స్పేస్ షటిల్స్, స్పేస్ సూట్స్ వంటివన్నీ హాలీవుడ్ సినిమాలను తలపిస్తుండగా.. గ్రాఫిక్స్ మాత్రం హాలీవుడ్ ను మించిన స్థాయిలో ఉన్నాయి.

షూటింగ్ మొదలైన 5 నెలలకే టీజర్ ను విడుదల చేయడం, అది కూడా ఎవరూ వేలెత్తి చూపడానికి వీలులేకుండా టీజర్ ను విడుదల చేసి సంకల్ప్ రెడ్డి దర్శకుడిగా తన సత్తాను చాటుకొంటే.. నిర్మాతలు రాజీవ్ రెడ్డి-సాయిబాబులు తాము నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదని చెప్పకనే చెబుతున్నారు. అన్నిటికీ మించి.. వరుస విజయాలతో దూసుకుపోతున్న వరుణ్ తేజ్ “అంతరిక్షం” టీజర్ తో తాను రేస్ లో ఉన్న యువ కథానాయకులందరికంటే కూడా ముందున్నానని ప్రూవ్ చేసుకొన్నాడు. డిసెంబర్ 21న విడుదలవుతున్న ఈ చిత్రం మన తెలుగు సినిమా స్థాయిని పెంచడం ఖాయమని అర్ధమవుతోంది.

Share.