అమర్ అక్బర్ ఆంటోనీ

“నీకోసం, వెంకీ, దుబాయ్ శీను” లాంటి డిఫరెంట్ మూవీస్ & సూపర్ హిట్ చిత్రాల తర్వాత శ్రీనువైట్ల-రవితేజ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం “అమర్ అక్బర్ ఆంటోనీ”. “ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్” లాంటి డిజాస్టర్స్ తర్వాత శ్రీనువైట్ల, “టచ్ చేసి చూడు, నేల టికెట్” లాంటి డిజాస్టర్స్ తర్వాత రవితేజ చేస్తున్న సినిమా కావడంతో తొలుత ఈ సినిమా మీద ఎవరికీ నమ్మకం లేకపోయినా.. ఇలియానా హీరోయిన్ గా టీం లో జాయిన్ అవ్వడం, టీజర్, ట్రైలర్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో జనాలు కాస్త ఆసక్తి కనబరిచారు. మరి రవితేజ-శ్రీనువైట్ల కాంబినేషన్ ఆ మినిమమ్ ఎక్స్ పెక్టేషన్స్ నైనా అందుకోగలిగిందా లేదా అనేది చూద్దాం..!! aaa-2

కథ : బహుశా నా కెరీర్ లో మొదటిసారిగా “కథ” అనే కాలమ్ ఫిల్ చేయడానికి ఇంతగా కష్టపడుతున్నానేమో. పాపం శ్రీనువైట్ల కూడా కథను డెవలప్ చేసుకొంటున్నప్పుడు ఇంతలా మాధానపడి ఉండడు.

సో, సింపుల్ గా స్టోరీ లైన్ ఏంటంటే.. చిన్నప్పుడు తన తల్లిదండ్రులతోపాటు తన అనుకున్నవాళ్లందరినీ చంపేసిన ఓ విలన్ గ్యాంగ్ ను చంపడం కోసమే 14 ఏళ్ల పాటు జైల్లో పెరిగి పెద్దయిన అమర్ (రవితేజ) తనకున్న మానసిక రుగ్మతులను అధిగమించి తన పగ ఎలా తీర్చుకున్నాడు? అనేది కథాంశం.

ఈమధ్యలో వచ్చే అక్బర్ & ఆంటోనీలు.. అమర్ కి ఉన్న ఓ మానసిక రుగ్మతి (అదేంటని మాత్రం అడగకండి గుర్తులేదు) కారణంగా అద్దం పగిలిన శబ్ధం విన్నప్పుడు ఒకడు, ఎవరైనా మానసిక రోగిని చూసినప్పుడు అమర్ నుంచి వచ్చే డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నమాట (స్ప్లిట్ పర్సనాలిటీ). aaa-3

నటీనటుల పనితీరు : రవితేజ అనే అద్భుతమైన నటుడ్ని దుర్వినియోగపరుచుకోవడం ఎలా? అనే ప్రశ్నకు సమాధానంగా ఈ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్స్ & వేరియేషన్స్ ఉంటాయి. శ్రీనువైట్ల మీద గుడ్డి నమ్మకమో లేక ఎల్లప్పుడు ఆయన వెంట ఉండే కేర్ లెస్ యాటిట్యూడో అర్ధం కాదు కానీ.. రవితేజ తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా ఈ సినిమాలో నటుడిగా ఫెయిల్ అయ్యాడు. ఆఖరికి “దేవుడు చేసిన మనుషులు” లాంటి కథ లేని సినిమాలో కూడా తనదైన బాడీ లాంగ్వేజ్ తో నవ్వించిన రవితేజ ఈ సినిమాలో నవ్వించడం పక్కన పెడితే.. ఆయన తన క్యారెక్టరైజేషన్ తో వేరియేషన్ చూపిన ప్రతిసారి ప్రేక్షకుడు తలబాదుకున్నాడు.

మరి టాలీవుడ్ నుంచి ఆరేళ్ళ గ్యాప్ తీసుకోవడం వల్లనో లేక లావైపోవడం వల్లనో తెలియదు కానీ.. ఇలియానాలో ఇదివరకటి షార్ప్ నెస్ కనబడలేదు. చూడ్డానికి అందంగా ఉండడంతోపాటు.. తన పాత్రకి తానే అద్భుతంగా డబ్బింగ్ చెప్పుకొన్న ఇలియానా డ్యాన్స్ విషయంలో మాత్రం తన అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. సినిమా మొత్తానికి కొరియోగ్రాఫర్ ఒక్కటే స్టెప్ ఇచ్చాడేమో అన్నట్లు ఒకే మూమెంట్ ను రిపీటెడ్ గా చేస్తూ “ఏంటి ఇలియానా ఇది?” అని ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఫీలయ్యేలా ఉంది ఆమె పాత్ర.

వింటేజ్ సునీల్ మళ్ళీ బ్యాక్ అనిపించినా.. ఆ సన్నివేశాలు, సంభాషణాల్లో కొత్తదనం కొరవడడంతో అతని పాత్ర పండలేదు. వెన్నెల కిషోర్, రఘుబాబు, శ్రీనివాసరెడ్డిల కాంబినేషన్ నవ్వించడానికి ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఫలితం దక్కలేదు. సత్య మాత్రం జూనియర్ పాల్ గా నవ్వించాడు. సినిమా మొత్తానికి ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే ఇదొక్కటే. షాయాజీ షిండే మరియు ఓ నలుగురు విలన్ పాత్రల పోషించిన నటుల గురించి పెద్దగా చెప్పుకోవడానికీ ఏమీ లేదు. aaa-2

సాంకేతికవర్గం పనితీరు : శ్రీనువైట్ల “అమర్ అక్బర్ ఆంటోనీ” ప్రమోషన్స్ లో మాట్లాడుతూ “సినిమా చాలా కొత్తగా ఉంటుంది, తెలుగులో ఇప్పటివరకు ఈ తరహా కథతో సినిమా రాలేదు” అని బల్ల గుద్ధకపోయినా.. నొక్కి వక్కాణించి మరీ చెప్పాడు. మరి ఆయన సురేందర్ రెడ్డి తీసిన “అతనొక్కడే” చూడలేదా లేక చూసినా గుర్తులేదా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పి తీరాలి. అసలు “మిస్టర్” లాంటి డిజాస్టర్ తర్వాత శ్రీనువైట్లకు అవకాశం రావడం అది కూడా.. రవితేజ హీరోగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో అనేసరికి అదేదో ప్రపంచవింత అనుకొన్నారందరూ. అలాంటి అరుదైన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిన శ్రీనువైట్ల.. దారుణంగా దుర్వినియోగపరుచుకున్నాడు. నిన్నమొన్నటివరకూ ఒక దర్శకుడిగా ఆయన మీద ఉన్న కాస్తంత రెస్పెక్ట్ కూడా ఈ సినిమాతో పోగొట్టుకొన్నాడు శ్రీనువైట్ల.

‘అరవింద సమేత”తో అద్భుతం అనిపించుకొన్న తమన్ కి శ్రీనువైట్ల ఇచ్చిన బ్యాడ్ బర్త్ డే గిఫ్ట్ “అమర్ అక్బర్ ఆంటోనీ” (ఇవాళ సంగీత దర్శకుడు తమన్ పుట్టినరోజు).

వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ వర్క్ గానీ.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వేల్యుస్ కానీ చాలా చీప్ గా ఉన్నాయి. ఓ అగ్ర నిర్మాణ సంస్థ నుంచి ఇంత చీప్ గ్రాఫిక్స్ కానీ సీజీ వర్క్ కానీ పొరపాటున ఎక్స్ పెక్ట్ చేయం.aaa-4

విశ్లేషణ : ఒక అద్భుతమైన నటుడి దుర్వినియోగం ఈ సినిమా, ఓ మంచి నిర్మాణ సంస్థ నమ్మకాన్ని తునాతునకలు చేసిన వైనం ఈ చిత్రం, ప్రేక్షకుల అంచనాలను కాదు కదా కనీసం ఆశల్ని సైతం అందుకోలేక పాతాళంలో భూస్థాపితం అయిపోయిన ఓ దర్శకుడి ఫెయిల్యూర్ స్టోరీ ఈ ప్రయాణం. ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో “అమర్ అక్బర్ ఆంటోనీ” నిలవడం ఖాయం. aaa-5

రేటింగ్ : 1.5/5

Share.