డైరక్టర్ తో గొడవపై స్పందించిన అఖిల్!

అక్కినేని ప్రిన్స్ అఖిల్ “హలో” చిత్రం తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ భామ నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో అఖిల్‌కు, వెంకీకి మధ్య గొడవలు వచ్చాయని రెండు రోజులుగా వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై అఖిల్‌, వెంకీ స్పందించారు. ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో వెంకీ, అఖిల్‌ సీరియస్‌గా ఏదో విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కన్పించారు. ఆ విషయాన్ని ఇద్దరూ ఒకేసారి చెప్పబోతుండగా అఖిల్‌ మధ్యలో ఆగి.. “మీరే కదా డైరెక్టర్‌ మీరు చెప్పండి” అన్నారు.

దానికి వెంకీ స్పందిస్తూ.. “హీరో కదా మీరే చెప్పండి” అన్నారు. దాంతో అఖిల్ మాట్లాడుతూ… “వెంకీకి నాకు క్రియేటివిటీ విషయంలో విభేదాలు వస్తున్నాయట. కానీ తను దర్శకుడు కాబట్టి ఆయన చెప్పిందే నేను చేస్తున్నాను. నాకు ఈయనకు గొడవ జరిగిందని వస్తున్న వార్తలన్నీ నిజమే అని చెప్పడానికి ఈ వీడియో పోస్ట్‌ చేస్తున్నాను” అని ఒక్కసారిగా ఇద్దరూ  నవ్వేశారు. ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఈ వీడియో ద్వారా తెలిపారు. బీవీఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి “మిస్టర్ మజ్ను” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

Share.